కోవెలకుంట్లలో రాజకీయ సిద్ధాంతవేత్తగా, అడ్వకేటుగా, ఎమ్‌.ఎల్‌.ఏ.గా కర్రా సుబ్బారెడ్డి గారి గురించి తెలియని వారు అరుదు. నిరాడంబరుడు, నిజాయితీ కలిగిన ఎమ్‌.ఎల్‌.ఏ.గా ముచ్చటగా మూడుసార్లు గెలిచి ‘‘హ్యాట్రిక్‌’’ సాదించిన ఘనత కర్రా సుబ్బారెడ్డి గారికే దక్కింది. ఆయన అందరివాడు, అందరికి అందేవాడుగా జనాదరణ పొందారు.

జననం, విద్యాభ్యాసం:

కోవెలకుంట్ల తాలుకా ఉయ్యాలవాడ మండలం లోని కుందూనది పరివాహక ప్రాంతంలోని పెద్దయమ్మనూరు అను ఓ కుగ్రామంలో 1937 మే నెల 1 తేదీన శ్రీ కర్రా వెంకటరెడ్డి, కర్రా వెంకమ్మ దంపతులకు కర్రా సుబ్బారెడ్డి గారు జన్మించారు. బాల్యంలోనే కాకరవాడ వాసులైన తమ సమీప బంధువులకు దత్తపుత్రుడుగా వెళ్లారు. ఆళ్లగడ్డలో ప్రాథమిక విద్య, ఫిరంగిపురంలో హైస్కూలు విద్య పూర్తిచేసుకుని పిమ్మట అరుదైన న్యాయవాద వృత్తి పట్ల మక్కువతో ఆయన విజయవాడ లయోలా కాలేజీలో బి.ఏ. చదివి, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో బి.ఎల్‌. పూర్తిచేసుకొన్నారు. విజయవాడ లయోల కాలేజీలో చదివేటప్పుడు పరిచయమైన కామ్రేడ్‌ గంగిరెడ్డి వెంకట కొండారెడ్డి గారితో ఏర్పడిన స్నేహబంధం మరణించేంత వరకు కొనసాగింది. వీరిద్దరు నమ్మిన సిద్ధాంతాల కోసం చివరివరకు పోరాడారు.

వివాహం – సంతానం:

1960 సంవత్సరంలో హరివరం గ్రామానికి చెందిన టి.పుల్లారెడ్డి గారి ద్వితీయ పుత్రిక సౌ॥ వెంకటమ్మ గారిని వివాహం చేసుకున్నారు. సౌమ్యుడు అయిన కర్రా గారు రాజకీయంగా ఎదగడానికి ఆయన ఇల్లాలు వెంకటమ్మ గారు వెన్నెముకగా నిలిచారని చెప్పడానికి ఎలాంటి సందేహమే లేదు. ఆయన వృత్తిపరంగా, రాజకీయపరంగా తలమునకలై ఉన్నప్పుడు వారి ఇంటికి వచ్చిన వారి సోదరులను, బంధువులను, అతిథులను ఎంతో అభిమానంతో, ఓర్పుతో, నేర్పుతో వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకుని కర్రా గారికి ఎంతో సహకరించేవారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో మొదటి కుమారుడు హర్షవర్ధన్‌ రెడ్డి ఆయన వారసుడిగా కోవెలకుంట్లలో ఉంటున్నారు. 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్‌ పర్సన్‌గా హర్షవర్ధన్‌ గారి సతీమణి కర్రా గిరిజ గారు నియమితులయ్యారు. రెండవ కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉంటున్నారు. ఆయన పెద్ద కూతురు కృష్ణ కౌస్తుభ గారు హైదరాబాదులోనూ, చిన్న కూతురు డాక్టర్‌ రమణి గారు హోమియోపతి డాక్టర్‌గా కోవెలకుంట్ల తాలూకాలోని వారి సొంత ఊరైన పెద్దయమ్మనూరులో పనిచేస్తున్నారు.

అడ్వకేట్‌గా ప్రస్థానం:

మొదటగా కర్నూలులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కర్నూలులో అప్పటి సీనియర్‌ లాయర్‌ శ్రీ నాగయ్య గారి దగ్గర జూనియర్‌గా చేరారు, ఆయనతోపాటు సంజామలకు చెందిన ఆయన సహాధ్యాయి సత్యనారాయణ గారు కూడా వారితో పాటే జూనియర్‌గా చేరి లాయర్‌ వృత్తి ప్రారంభించారు. తదుపరి కోవెలకుంట్లకు మున్సిఫ్‌ కోర్టు వచ్చాక, తన సొంత తాలూకా అయిన కోవెలకుంట్లకు మకాంమార్చి అక్కడే ప్రాక్టీసు, మొదలు పెట్టారు. వృత్తిని దైవంగా భావిస్తూ అడ్వకేట్‌గా ఫీజు గురించి ఆలోచించక, పేద, ధనిక అన్నివర్గాలకు అందుబాటులో ఉంటూ కేసులు వాదించేవారు. ఎక్కువగా క్రిమినల్‌ కేసులను చేపట్టేవారు. నిరుద్యోగులకు, పేదవారికి ఎప్పుడూ అండగా ఉండేవారు.

1979లో గోర్లగుట్ట వద్ద ఏడు మందిని హత్య చేసిన ఉదంతం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. ప్రస్తుత పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి తండ్రిని, కుటుంబ సభ్యులను ప్రత్యర్థులు హత్య చేశారు, మృత దేహాలను పోస్టుమార్టం చేయించేందుకు కూడా ఎవరూ ముందుకురాని క్లిష్ట సమయంలో కర్రా సుబ్బారెడ్డి గారు ముందుండి పోస్టుమార్టం చేయించి, వారి తరపున వకాల్తా తీసుకొని కోర్టులో కేసు వాదించిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు వుంది.

కోవెలకుంట్ల సబ్‌ జైల్లో మొదటి అంతస్తులోని గదిలో నాటు బాంబులు వేసి చల్లా చిన్నపరెడ్డి గారిని ప్రత్యర్థులు హత్య చేసిన కేసుకూడా అప్పుడు సంచలనం సృష్టించింది. ఈ కేసు కూడా కర్రా గారే వాదించారు. ముఠాకక్షలతో తల్లడిల్లుతున్న ఈ ప్రాంతంలో ఉంటూ కూడా ఆయన ఫ్యాక్షనిజాన్ని తన దరిచేరనీయకుండా తన అనుచరుల్లో వున్న ఫ్యాక్షనిస్టులను కూడా ప్రత్యర్థులతో రాజీ చేయించిన ఘనత కర్రా గారిదే. అవుకు మండల టిడిపి నాయకులు ఫక్కీర్రెడ్డిని అప్పటి ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి గారితో రాజీ చేయించి ఆ ప్రాంతంలో శాంతిసుమాలు విరబూయించడం వెనుక వీరికృషి ఉంది.

సామాజిక సేవ, రాజకీయ ప్రస్థానం:

కోవెలకుంట్ల పంచాయితీ సమితిలో పనిచేసే కొప్పర్తి అమరలింగేశ్వర రావుగారు వీరికి సన్నిహితులు. రాజకీయ నాయకులుగా పేరొందిన మద్దూరి సుబ్బారెడ్డి గారికి పి.ఏ.గా పనిచేసిన రూపనగుడి ఓబులేసు గారు వీరికి మరో సన్నిహితులు. వీరు ముగ్గురు రోజు సాయంత్రం రంగస్వామి గుడిలో కూర్చుని చర్చించుకునేవారు. ఆ తర్వాత బుడ్డా వెంగళరెడ్డి మెమోరియల్‌ వైద్యశాల వద్దకు వచ్చి, అక్కడ కోవెలకుంట్ల యువ సమాఖ్య సభ్యులతో కలిసి సమావేశం జరిపేవారు. అప్పటి యువకులు అందరితో వయసుతో సంబంధం లేకుండా బాగా కలిసిపోయేవారు. వారి ఈ చర్చల ఫలితమే కర్రా గారి రాజకీయ రంగ ప్రవేశానికి నాంది అయిందని చెప్పవచ్చు.

1975 ప్రాంతంలో తీవ్ర దుర్భిక్షం, వెట్టిచాకిరి, అంటరానితనం రేనాటి గడ్డను పీడిస్తున్న సమయంలో వాటికి చరమగీతం పాడాలని ప్రజా శ్రేయస్సు కోసం కొందరి యువకులతో కలిసి ప్రారంభించబడిన కోవెలకుంట్ల తాలూకా యువ సమాఖ్య అధ్యక్షులుగా పనిచేశారు. 1977లో వచ్చిన ఉప్పెన దివిసీమను కకావికలం చేసినప్పుడు ఈ యువ సమాఖ్య ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి తమవంతు సహాయం అందించారు. ఇలా ప్రజాసేవలో, న్యాయవాద వృత్తిలో రాణిస్తున్న సమయంలో సమకాలీన పరిస్థితులను చూసి ఉత్తేజితుడై ప్రజాసేవకు సరియైన మార్గం, రాజకీయ రంగమే అని భావించారు. 1974 సంవత్సరంలో అప్పటి సిట్టింగ్‌ యం.యల్‌.ఏ. అయిన శ్రీ బి.వి. సుబ్బారెడ్డిగారి హఠాన్మరణంతో 1974లో కోవెలకుంట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో యం.యల్‌.ఏ. పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసిసప్పుడు అమరలింగేశ్వర రావుగారు ప్రచారానికి కావలసిన సమాచరం సమీకరించేవారు. దొర్నిపాడుకు చెందిన కవికిషోర్‌ డి.శంకర్‌ అనే యువ కవి, పాటల రచయిత గారితో పాటలు, స్లోగన్స్‌ వ్రాయించి వాటికి ట్యూన్స్‌ కట్టించి మైకుల ద్వారా ప్రచారం చేసేవారు. అప్పుడు ఎలక్షన్‌ సింబల్‌ కర్రా గారికి ఏనుగు గుర్తు వచ్చింది. ఈ పాటలు ప్రజలను బాగా ఆకర్షించాయి. కానీ తన ప్రత్యర్థి అయిన అప్పటి సీనియర్‌ నాయకులు శ్రీ యం.వి. వెంకట సుబ్బారెడ్డి (గా.మా.గో) గారి చేతిలో ఓటమి పాలయ్యారు.

1977లో జనతా పార్టీలోచేరి నంద్యాల ఎం.పీగా పోటీ చేసిన శ్రీ నీలం సంజీవ రెడ్డిగారి గెలుపునకు తీవ్రంగా కృషిచేసినారు. తదుపరి, 1981లో కోవెలకుంట్ల సమితి ప్రెసిడెంట్‌గా పోటీ చేసి శ్రీ కానాల కాశిరెడ్డి గారి చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ ఈ ఎన్నికలలో స్వతహాగా సౌమ్యుడైన ఆయనకు మంచి గుర్తింపు, ప్రజాదరణ దక్కింది.

1983 సం.లో సాధారణ ఎన్నికలలో కర్రా గారు మరియు తన ప్రియ మిత్రుడు గంగిరెడ్డి వెంకట కొండారెడ్డి గారు ఇరువురికి నందమూరి తారక రామారావుగారి సారథ్యంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ కమిటీ నుంచి పార్టీ టిక్కెట్టు తీసుకొని టి.డి.పి. తరపున పోటీ చేయవలసినదిగా ఆహ్వానం వచ్చింది. కానీ, అప్పటి స్థానిక రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, ఈ మిత్రద్వయం టి.డి.పి. టిక్కెట్టును సున్నితంగా తిరస్కరించినారు. అనూహ్యంగా టి.డి.పి. గెలిచి పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఎన్‌.టి.ఆర్‌. గారు ముఖ్యమంత్రిగా పదవినధిష్టించిన అతి కొద్దికాలంలోనే అనగా కేవలం 17 నెలల స్వల్ప కాలంలోనే నాదెండ్ల భాస్కర రావు గారి చేతిలో వెన్నుపోటుకు గురై ఎన్‌.టి.ఆర్‌.గారు పదవీచ్యుతులై తిరిగి మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చారు. అప్పుడు 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ కర్రా, జి.వి. కొండారెడ్డి గారు ఇరువురూ ‘‘మనలో ఎవరికి టిక్కెట్టు వచ్చినా మిగిలినవారు టిక్కెట్టు లభించినవారిని బలపరుస్తూ ఎన్నికలలో సహాయ సహకారాలు అందించుకొనవలెనని ఒక ఒప్పందమును చేసుకొని విడివిడిగా టి.డి.పి. టిక్కెట్టుకు ప్రయత్నించారు. కానీ అనుకోకుండా టిక్కెట్టు మన కర్రా సుబ్బారెడ్డిగారికే దక్కినది మరియూ విజయమూ వారినే వరించినది. 15 వేల ఓట్ల మెజారిటీతో శ్రీ బి.వి. రామస్వామి రెడ్డి గారిపై గెలుపొందారు. ఎన్‌.టి.ఆర్‌. గారు శ్రీ కర్రా సుబ్బారెడ్డి గారిని అసెంబ్లీ స్పీకర్‌గా నియమించదలిచినపుడు కొందరు కుటిలబుద్ధితో ఏవో కొన్ని కుంటిసాకులు చూపించి స్పీకర్‌ పదవిని రాకుండా అడ్డుకున్నారు. అయితేనేం ఆయన మొదటి సారిగా ఎమ్‌.ఎల్‌.ఏ. హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టినది మొదలు వరుసగా మూడు సార్లు గెలిచారు. 1989 ఎన్నికలలో కాంగ్రెస్‌ గాలి బలంగా వీచి తెలుగుదేశం పార్టీకి చెందిన మహామహులు సైతం ఓడిపోయినప్పటికీ కోవెలకుంట్లలో కర్రా సుబ్బారెడ్డి గారు మాత్రం 7,189 ఓట్ల ఆధిక్యతతో శ్రీ ఎస్‌. వి. సుబ్బారెడ్డిగారిపై విజయం సాధించారు. కర్రా గారు అప్పటికే ఎన్టీఆర్‌ గారికి ఎంతో సన్నిహితులుగా ఉండేవారు. అప్పుడు 1991లో జరిగిన పార్లమెంట్‌ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌ అనూహ్యంగా గెలిచి, శ్రీ పి.వి. నరసింహారావు గారు ప్రధానమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత ఆయన నంద్యాల పార్లమెంటు స్థానం నుండి ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసినపుడు, మన తెలుగువాడు డిల్లీి పీఠమెక్కబోతుండగా సాటి తెలుగువారమైన మనమే పోటీగా అభ్యర్థిని నిలబెట్టడం సమంజసం కాదంటూ, కర్రాగారు ఎన్‌.టి.ఆర్‌. గారిని ఒప్పించి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీగా ఎవరిని నిలబెట్ట కుండా పి.వి. గారి గెలుపునకు కృషి చేశారు. ఆ తర్వాత కోవెలకుంట్ల ప్రాంతంలో ప్రజలకు త్రాగు నీటికొరత సమస్య తీర్చేందుకు కుందూ నది ఒడ్డున సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను కట్టడానికి అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి పి.వి గారితో శంకుస్థాపన చేయించారు. మొదటినుంచి వ్యవసాయం మరియు నీటిపారుదలకు సంబంధించిన విషయాలపై మంచి పట్టు, అవగాహన ఉండడమే దీనికి కారణం అని చెప్పవచ్చు.

1994 ఎన్నికలలో పోటీచేసి 1702 ఓట్ల ఆధిక్యతతో శ్రీ చల్లా రామకృష్ణారెడ్డి గారిపై గెలుపొందిన శ్రీ కర్రా సుబ్బారెడ్డి గారు ‘‘హ్యాట్రిక్‌’’ కొట్టిన అతికొద్దిమంది రాయలసీమ నాయకులలో ఒకరుగా నిలిచారు. ఆయన తన పదవీ కాలంలో ఏనాడూ అవినీతిని ప్రోత్సహించలేదు: అవినీతి మరక అంటని రాజకీయ వేత్తగా మచ్చలేని జీవితం గడిపారు. 15 సంవత్సరాలు ఏకధాటిగా ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులలో నాణ్యతకే ప్రాధాన్యమిచ్చారు. నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని కోరుతూ సంబంధిత అధికారులను కూడా అవినీతికి దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు.

1990లో కర్రా సుబ్బారెడ్డి గారు కుందూనదిపై చిన్నతరహా నీటి పారుదల పైలెట్‌ ప్రాజెక్టుల కొరకై తీవ్రంగా కృషి చేశారు. దీనివల్ల అక్కడి చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఎంతోమందికి ఆసరాగా ఉంటుందని అప్పుడే ఆయన ఊహించారు. కర్రా గారికి వ్యవసాయం మరియు నీటిపారుదల సమస్యలపట్ల ఉన్నటువంటి మంచి అవగాహనే దీనికి కారణమని చెప్పక తప్పదు. ఆయన రాజకీయ పార్టీలకు అతీతంగా రాయలసీమ నాయకులు అందరూ అభిమానించే వ్యక్తి.

ఇదే విధంగా అవుకు రిజర్వాయర్‌ నిర్మించడానికి వీరు ఎమ్‌.ఎల్‌.ఏ. కాకముందు నుంచే కామ్రేడ్‌ జి వి కొండారెడ్డి గారితో పాటు పోరాటం చేశారు. అంతేకాకుండా అప్పట్లో కొలిమిగుండ్ల మండలంలో స్థాపించిన ఎల్‌ & టి సిమెంట్‌ ఫ్యాక్టరీ స్థాపనకు ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. అప్పటికే వర్గ పోరాటాలతో అట్టుడికి పోతున్న ఈ మండలంలోని ఇరుపక్షాల నాయకులకు సయోధ్య కుదిర్చి వారి మధ్య గల ముఠా తగాదాలను తనకున్న అనుభవంతో, మంచితనంతో రాజీచేసి, ఫ్యాక్టరీ ప్రారంభించడానికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో ప్రారంభించిన పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీ భూముల సేకరణ విషయంలో ఏర్పడ్డ తగాదాలను చాలా నేర్పుగా పరిష్కరించారు. ఎల్‌ & టి ఫ్యాక్టరీ సీ.ఈ.వో అయిన సి.వి. రెడ్డి గారు కర్రా గారిని ఎంతో అభిమానించేవారు. తమ ఫ్యాక్టరీ ప్రారంభించడానికి ఆయన నిస్వార్థంగా సహాయ పడ్డారని, అంత నిజాయితీ గల రాజకీయ నాయకున్ని ఇంతవరకు చూడలేదని ఒకానొక సందర్భంలో వారు చెప్పారు. 2001 దశకంలో లాయర్‌ బాబు గారు సర్పంచ్‌గా ఉన్నప్పుడు కోవెలకుంట్ల ఇండోర్‌ స్టేడియం వెనక కట్టిన కమ్యూనిటీ హాల్‌ కొరకు, అడగగానే ఎల్‌ &టి సి.ఇ.ఓ. సి.వి. రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం, ఆయనకు కర్రా గారి పైగల అపార అభిమానమేనని చెప్పక తప్పదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కోవెలకుంట్ల లోనే అద్దె ఇంట్లోనే ఎక్కువకాలం నివసించారు. 2004 సంవత్సరంలో అమెరికాలో ఉన్న ఆయన చిన్న కుమారుడు కట్టించిన ఇంటికి మకాం మార్చారు.

కర్రా సుబ్బారెడ్డి గారు ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు. మహోన్నతమైన వ్యక్తిత్వం వున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన కర్రాను వెతుక్కుంటూ పదవులు వచ్చాయని, ఆయన అభిమానులు గర్వంగా చెబుతుంటారు. 1985లో లేబర్‌ కంట్రాక్టు కమిటి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1993లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుండగా పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ పదవిని అలంకరించారు. 1994లో ఎస్టిమేట్‌ కమిటీ సభ్యుడిగా, రెండు పర్యాయాలు సబార్డినేట్స్‌ లెజిస్లేచర్స్‌ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ‘‘పదవులకు మనం వన్నె తేవాలే కాని పదవుల వలన మనకు గుర్తింపు రాకూడదని’’ సన్నిహితుల వద్ద చెప్పే కర్రా, చివరి వరకు అదే బాటలోనే నడిచారు. ఎమ్మెల్యేగా వున్న సమయంలో 1998లో కుందూనదికి వరదలు వచ్చాయి. ఒక మహిళ నదిలో పడి కొట్టుకుపోతుండగా, ఆ క్షణంలో నదిలో దూకి ఆమె ప్రాణాలు కాపాడి, తనలోని సామాజిక స్పృహను, ధైర్యాన్ని చాటుకున్నారు.

వ్యక్తిత్వం:

ఆంధ్ర రాజకీయాలలో వివాద రహితుడిగా, సౌమ్యుడిగా పేరుగాంచారు. శ్రీ కర్రా గారిని అప్పటి అపోజిషన్‌ పార్టీ నాయకులైన డా॥ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ‘‘కరడుగట్టిన ఫ్యాక్షన్‌ గడ్డలో జన్మించినా గన్‌మెన్‌ సెక్యూరిటీ లేకుండా సంచరించ గలిగిన ఏకైక ఎమ్‌.ఎల్‌.ఏ.గా’’ శ్రీ కర్రా గారిని అభినందించారు. నిగర్వి, నిజాయితీకి మారుపేరుగా ఉంటూ ప్రజాసేవ చేసిన నాయకుడిగా ప్రజల మనసులు గెలిచి, ఇప్పటి నాయకులవలే పదవిని అడ్డం పెట్టుకొని ఆస్తుల సముపార్జన చేపట్టక తనకున్న సంపదనే ప్రజలకోసం ఖర్చుచేసిన సంపూర్ణ వ్యక్తిత్వం కల్గిన ప్రజా నాయకుడుగా, పేదలపాలిటి పెన్నిధిగా నిలిచారు. అంతేకాకుండా వయసుతో సంబంధం లేకుండా అప్పుడప్పుడు జూనియర్‌ కాలేజీకి సాయంత్రం వారి ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చి అక్కడి విద్యార్థులతో కలిసి బాల్‌ బ్యాడ్మింటన్‌ కూడా ఆడేవారు. ఆయనకు క్రీడలపై కల అభిమానం ఎంత ఉంది అన్నది పక్కకు పెడితే, తన కన్నా చిన్న వయస్సుగల పిల్లలతో కలిసి, తన స్థాయిని మర్చిపోయి సరదాగా ఆడడం అనేది ఆయనకే చెల్లింది. ఆయన మంచి బాల్‌ బ్యాడ్మెంటన్‌ ప్లేయర్‌.

ఒకసారి అసెంబ్లీలో అకౌంటెంట్‌ ఒకావిడ ‘‘మీ ఎమ్‌.ఎల్‌.ఏ. కర్రా సుబ్బారెడ్డి గారు అందరు ఎమ్‌.ఎల్‌.ఏ.ల వలే లాడ్జి, ఆటో, ఫుడ్‌ మొదలైన ఖర్చులకు సంబంధించిన అలవెన్సులకొరకు ఇంతవరకు ఒక్కసారి కూడా బిల్లు పెట్టలేదు. ఇటువంటి నిజాయితీపరుడైన నాయకుడిని ఇన్ని ఏళ్లలో అసెంబ్లీలో చూడలేదు’’ అని కితాబు ఇచ్చారు. నిజమే ఎన్నోసార్లు హైదరాబాద్‌కు ఆయన ఆర్‌.టి.సి. బస్సులో ప్రయాణిస్తూనే అందరికి కనిపించేవారు.

రాజకీయ విరమణ:

ఈ క్రమంలో నాలుగవ పర్యాయం 1999 ఎన్నికలలో జరిగిన రిగ్గింగుల వలన, సొంత పార్టీలోని వెన్నుపోటు రాజకీయాలవల్ల కర్రా సుబ్బారెడ్డి గారు ఓటమి పాలయ్యారు. 2004లో మాత్రం టికెట్‌ కోసం ఆయనకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. పలు రాజకీయ సమీకరణాల పేరుతో పార్టీ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. దీంతో కలత చెందిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తదుపరి రాజకీయ విరమణచేసి శేష జీవితమంతా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ వాసులకు నీటివనరుల పోరాటం గురించిన చర్చా వేదికలలో పాల్గొనేవారు. తదుపరి కోవెలకుంట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలన్నీ అయన పెద్ద కుమారుడు శ్రీ కర్రా హర్షవర్ధన్‌ రెడ్డి గారే చూసుకొనేవారు. తరువాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని ఎవరు ఎంతగా బలవంతపెట్టినా ఆయన ఇప్పుడున్న ‘‘కుటిల రాజకీయాల ముందు తన నిజాయితీ సరిపోదని’’ గ్రహించి విరమించు కున్నారు.

అంత్యదశ:

ఆ తర్వాత పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకుంటూ తన 68వ ఏట 2004 డిసెంబర్‌ 8వ తేదీన గుండెపోటుతో హైదరాబాదులో కిమ్స్‌ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉదయం గం॥ 11.40 నిముషాలకు స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులంతా భోరున విలపించారు. గన్‌మెన్‌లేని ఎమ్మెల్యేగా సామాన్యుడితో కూడా రోడ్డు ప్రక్కన నిలబడి ఆప్యాయంగా మాట్లాడే కర్రా గారు ఇకపై లేరనే నిజం అక్కడి ప్రజలను కలిచివేసింది అనటానికి కోవెలకుంట్లలోని వారి తోటలో జరిగిన ఆయన అంత్యక్రియలకు వేలాదిగా విచ్చేసిన జననీరాజనమే నిదర్శనం. రాజకీయాలకతీతంగా భౌతికకాయాన్ని దర్శించడానికి అన్ని పార్టీల నాయకులూ తరలి రావడం ఆయన వ్యక్తిత్వంపట్ల వారికున్న అభిమానమే ప్రధానం. ఇంతటి ప్రజాభిమానం పొందిన కర్రా సుబ్బారెడ్డి గారు ధన్యులు. విలక్షణ మైన, నిస్వార్థమైన వ్యక్తిత్వంతో కోవెలకుంట్ల ఖ్యాతిని పరిపుష్టం చేసిన కర్రా సుబ్బారెడ్డి గారు నేడు మన మధ్య లేకపోయినా, ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.